కుత్బుల్లాపూర్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) :
సర్-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అంకిత భావంతో పని చేసిన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులను బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజాంపేట్, బండారి లేఔట్, బాచుపల్లి డివిజన్లకు చెందిన బిఎల్ఏలు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కొలన్ హన్మంత్ రెడ్డి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, డిసిసి కమిటీ సభ్యులు హాజరై సర్ -2026లో విశేషంగా కృషి చేసిన నాయకులను సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్-2026 కార్యక్రమంలో ప్రతి బిఎల్ఎ, సీనియర్ నాయకుడు, డివిజన్ అధ్యక్షుడు చూపిన నిబద్ధత అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.




