Thursday, August 13, 2026
spot_img
Homeతెలంగాణఖర్గేను అవమానించేలా ‘శుద్ధీకరణ’.. ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధం

ఖర్గేను అవమానించేలా ‘శుద్ధీకరణ’.. ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధం

మహిళా కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ

హైదరాబాద్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) : 

 

ఇటీవల హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ ప్రదేశంలో హిందూ మితవాద సంస్థలు గంగాజలంతో ‘శుద్ధీకరణ’ పేరుతో ఆచారం నిర్వహించడాన్ని మహిళా కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వేదికపై ఉండటం వల్ల ఆ ప్రదేశం ‘అపవిత్రమైందంటూ’ శుద్ధీకరణ చేపట్టడం అత్యంత అవమానకరమైన చర్యగా ఆమె అభివర్ణించారు.

ఈ ఘటన బీజేపీ పెంపొందిస్తున్న వివక్షాపూరిత, విభజనాత్మక మనస్తత్వానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి ప్రతి వ్యక్తి గౌరవాన్ని, సమానత్వాన్ని కాపాడాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలకు స్థానం లేదన్నారు.

ఒక జాతీయ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని అవమానించే విధంగా జరిగిన ఈ ఘటన వ్యక్తి గత అవమానానికే పరిమితం కాదని, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం వంటి రాజ్యాంగ విలువలను అవమానించడమేనని నీలం పద్మ పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య భారతదేశంలో కులం, మతం, సామాజిక నేపథ్యం ఆధారంగా వ్యక్తులను వివక్షకు గురిచేసే ఆలోచనా విధానాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవాన్ని కల్పిస్తుందని, రాజకీయ ప్రత్యర్థులపై ద్వేషం పెంచే విధానాలకు బదులుగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఆమె ఉందన్నారు.

హల్ద్వానీ ఘటనపై సంబంధిత వర్గాలు స్పందించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.