ఏడేళ్లుగా జాతీయ పతాకానికి వెన్నెల ఫౌండేషన్ గౌరవ వందనం
రోడ్లపై పడివున్న జెండాల సేకరణ.. ప్రజల్లో అవగాహనకు వినూత్న కార్యక్రమం
పోస్టర్ ను ఆవిష్కరించిన టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) :
జాతీయ పతాకం పట్ల గౌరవం, బాధ్యతా భావాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు వెన్నెల ఫౌండేషన్ గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్న కృషిని తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత అభినందించారు. జాతీయ పతాకాలను సేకరణ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రూపొందించిన పోస్టర్ ను వెన్నెల ఫౌండేషన్ ప్రతినిధి సుంకర నరేష్ తో కలిసి ఆమె ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వెన్నెల ఫౌండేషన్ రూపొందించిన ప్రత్యేక అవగాహనా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడే ఈ కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరణ మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు, ప్రజల్లో జాతీయ జెండా పట్ల గౌరవం, బాధ్యతను పెంచేందుకు దోహదపడుతుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం రోడ్లపై చెల్లాచెదురుగా పడివున్న జాతీయ పతాకాలను గౌరవ పూర్వకంగా సేకరించడం ద్వారా జాతీయ జెండా గౌరవాన్ని కాపాడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వేడుకలు ముగిసిన తర్వాత జాతీయ పతాకాలు రోడ్లపై పడి ఉండటం, వాహనాల కింద లేదా చెత్తా చెదారంలో కనిపించడం దేశభక్తి, జాతీయ గౌరవానికి విరుద్ధమైన పరిస్థితిగా వెన్నెల ఫౌండేషన్ భావించిందన్నారు. అందుకే ప్రజలు ఉన్నా లేక పోయినా రోడ్లపై కనిపించే జాతీయ పతాకాలను గౌరవంగా సేకరించి, వాటిని సముచితంగా నిర్వహించే బాధ్యతను ఫౌండేషన్ చేపడుతుందన్నారు. భారత జాతీయ పతాక నియమావళి (ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా)లోని నిబంధనలకు అనుగుణంగా జాతీయ పతాకాన్ని గౌరవించడం, దాని పవిత్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం కేవలం జాతీయ పతాకాల సేకరణకే పరిమితం కాకుండా, జాతీయ జెండాను ఎక్కడ, ఎలా ప్రదర్శించాలి, వేడుకల అనంతరం దానిని ఎలా గౌరవ పూర్వకంగా ఖననం చేయాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా పండుగలు, జాతీయ వేడుకల సందర్భంగా ప్లాస్టిక్ లేదా కాగితంతో తయారైన జాతీయ పతాకాలను వినియోగించి అనంతరం వాటిని నిర్లక్ష్యంగా పడేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ అర్థవంతమైన కార్యక్రమంలో భాగస్వాములై తమ విలువైన సహకారం అందించిన రామ్ చల్లా, సాయి జ్యోతిలకు వెన్నెల ఫౌండేషన్ ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పతాకం దేశ సార్వభౌమత్వానికి, స్వాతంత్ర్యానికి, ఐక్యతకు ప్రతీక అని గుర్తు చేశారు. జాతీయ జెండాకు ఎల్లప్పుడూ తగిన గౌరవం, మర్యాద దక్కేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపు నిచ్చారు.“జాతీయ పతాకాన్ని గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడం” అనే సందేశంతో వెన్నెల ఫౌండేషన్ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమం ప్రజల్లో దేశభక్తి, జాతీయ బాధ్యతా భావాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




