హైదరాబాద్, సెప్టెంబర్ 25, (తెలంగాణ దిశ) :
ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ప్రతిపాదిత బ్యాంక్ సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నెల 27న ఆదివారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. ఆర్బీఐ ప్రత్యేక అనుమతితో దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధానిత శాఖలు ఈ ఆదివారం తెరిచి ఉంటాయని ఎల్డీఎం సి. శివ ప్రసాద్ తెలిపారు. ఖాతాదారుల అత్యవసర బ్యాంకింగ్ అవసరాలు, నగదు లావాదేవీలు తదితర సేవలకు అంతరాయం కలగకుండా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అత్యవసర బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.




