కార్తీక పౌర్ణమి వేళ దర్శనాల కోసం భక్తుల అవస్థలు..
ఏర్పాట్లపై వెల్లువెత్తుతున్న అసంతృప్తి
కీసర, (తెలంగాణ దిశ) :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ భవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఆశించిన స్థాయిలో సౌకర్యాలు కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వీఐపీలకు ప్రాధాన్యతతో దర్శనాలు సాగుతుండగా, మరోవైపు సామాన్య భక్తులు మాత్రం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. కార్తీక మాసం, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున కీసరగుట్టకు భక్తుల తాకిడి భారీగా ఉంటుంది. ఈ విషయం ముందుగానే తెలిసినప్పటికీ, అందుకు అనుగుణంగా దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, ఇతర కనీస సౌకర్యాల కల్పనపై మరింత శ్రద్ధ చూపాల్సి ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడంలో సమన్వయం కొరవడిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా సేవలు ఉండవా..!?
ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అష్టోత్తరాలు నిర్వహించుకోవాలంటే సామాన్య భక్తులకు భారంగా మారుతున్నాయని కొందరు భక్తులు అభిప్రాయపడుతున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రశాంతంగా పూజలు చేసుకోవాలనే భక్తుల ఆకాంక్షకు అనుగుణంగా సేవలు అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికీ సమాన గౌరవం, సౌకర్యవంతమైన దర్శన అవకాశం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.
ఆలయ నిర్వహణపై పర్యవేక్షణ ఏది..?
ఆలయ నిర్వహణలో ఒక కుటుంబం లేదా కొద్దిమంది వ్యక్తుల ఆధిపత్యం ఉందనే ఆరోపణలు కూడా స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆలయ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, భక్తుల సౌకర్యాలే ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల సమస్యలపై మరింత చొరవ చూపి, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని పలువురు సూచిస్తున్నారు. పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లోనూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆదాయం కంటే ఆధ్యాత్మిక సేవకే ప్రాధాన్యం ఇవ్వాలి..!
దూరప్రాంతాల నుంచి ఎంతో భక్తితో కీసరగుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ఆలయ యంత్రాంగం ప్రధాన బాధ్యత. వీఐపీ దర్శనాల నిర్వహణతో పాటు సామాన్య భక్తుల సౌకర్యాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. భక్తుల విశ్వాసాన్ని కాపాడేలా ఆలయ నిర్వహణ సాగాలని, రద్దీ రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు. దేవాలయం అంటే భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పవిత్ర ప్రదేశం. అక్కడ హోదాలు, పలుకు బడుల కంటే భక్తి భావానికే ప్రాధాన్యం ఉండాలి. కీసరగుట్ట ఆలయ అధికారులు భక్తుల ఆవేదనను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతారా? అన్నది వేచి చూడాలి.




