పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరల పంపిణీ..
సేవాభావంతో వేడుకలు నిర్వహించిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి దంపతులు
కుషాయిగూడ, నవంబర్ 27, (తెలంగాణ దిశ):
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కుషాయిగూడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శుక్రవారం కుషాయిగూడలోని సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలు ఉత్సాహ భరిత వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డితో కలిసి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కడికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలకు కేక్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కాప్రా సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. నిత్యం ప్రజారోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం శ్రమిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా కార్మికులను గుర్తించి వారికి చీరలు అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమంగా నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా కుషాయిగూడ పోలీసులు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ యజమానులు, కాప్రా పాత్రికేయ మిత్రులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజల ఆశీస్సులు, అభిమానమే తనకు కొండంత బలమని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రజలకు అందిస్తున్న సేవలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేసే నాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, గొల్లూరి అంజయ్య, కాసం మహిపాల్ రెడ్డి, పెద్దాపురం కుమారస్వామి, మురళి పంతులు, బేతాళ బాలరాజు, గంప కృష్ణ గుప్తా, విక్రమ్, షేర్ మణెమ్మ, శిరీష రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రమేష్ యాదవ్, కనకయ్య, బాలాజీ, దొంతం చంద్రశేఖర్, యాదగిరి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వేడుకలను విజయవంతం చేశారు.




