బీసీల రాజకీయ వాటా దక్కే వరకు పోరాటం: మెట్టుకాడి శ్రీనివాస్
హైదరాబాద్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) :
రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు రాజకీయ అధికారంలో జనాభా నిష్పత్తి మేరకు తగిన వాటా దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బహుజన రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే రాజకీయ పార్టీలకు ఇక చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. “ఓట్లు మావి.. సీట్లు మీవా? ఇక మా ఓటు మాకే” అనే నినాదంతో బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలని అన్నారు.
గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. బీసీలకు శాసనసభ, స్థానిక సంస్థలు, పాలనా వ్యవస్థలో జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం నిర్ణయాధికారంలో తగిన స్థానం కల్పించడం లేదని సమావేశంలో పలువురు నాయకులు విమర్శించారు.
రానున్న గ్రేటర్ ఎన్నికలను బీసీల రాజకీయ శక్తిని చాటేందుకు తొలి అడుగుగా మలచాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహాజన బహుజన వర్గాలను ఏకం చేసి రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. వ్యక్తులు, పార్టీలను మాత్రమే చూసి ఓటు వేయకుండా బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం వంటి అంశాల ఆధారంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
“మన ఓటు మనకే.. మన ప్రాతినిధ్యం మనకే.. మన రాజ్యాధికారం మనకే” అనే నినాదంతో గ్రేటర్ ఎన్నికల నుంచే రాజకీయ మార్పుకు శ్రీకారం చుడతామని ఆయన ప్రకటించారు. స్థానిక సంస్థల నుంచి శాసనసభ వరకు బీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన రాజకీయ వాటా కల్పించాలనే డిమాండ్‌ను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని నాయకులు తెలిపారు.
ఈ సమావేశంలో బీఆర్‌పీ ప్రధాన కార్యదర్శి మనపాటి ప్రదీప్‌కుమార్, మేదరి సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకటరాములు, నీలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరాములు, ఎన్‌టీఆర్ జాగృతి అధ్యక్షుడు ఏ.ఎస్.రావు, బీసీ మహాసభ ప్రధాన కార్యదర్శి వై.సాయన్న, సమన్వయకర్త నిరంజన్, జన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్, పెరిక సంఘం నాయకురాలు అడ్వకేట్ అలేఖ్య, సామాజిక కార్యకర్త పుష్ప గౌడ్, వాల్మీకి బోయల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మీను గోపీ, ఆరె కటిక సంఘం నాయకులు కృష్ణాజీ, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.




