కీసర, ఆగస్టు 25, (తెలంగాణ దిశ) : కీసరలోని సర్వే నంబర్ 329లో ఉన్న పురాతన బొడ్రాయి స్థలాన్ని కబ్జాల నుంచి కాపాడాలని కోరుతూ కీసర మాజీ ఉప సర్పంచ్ తటాకం లక్ష్మణ్ మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బొడ్రాయి ఉన్న ప్రాంతాన్ని కొందరు ఆక్రమించి, చుట్టూ ప్రహరీ నిర్మించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రాంతం మీదుగా కీసర గ్రామానికి చెందిన పలువురు ప్రజలు పురాతన శివాలయంతో పాటు తమ పొలాలకు రాకపోకలు సాగిస్తుంటారని లక్ష్మణ్ తెలిపారు. అయితే దారి సైతం ఆక్రమణకు గురికావడంతో గ్రామస్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నల్ల మధు అనే వ్యక్తి సదరు స్థలాన్ని కబ్జా చేసినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. బొడ్రాయి స్థలం, దారి ఉనికిని స్పష్టం చేసే పాత శాటిలైట్ చిత్రాలతో పాటు పురాతన బొడ్రాయి ఫొటోలను వినతి పత్రానికి జత చేసినట్లు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన బొడ్రాయి స్థలాన్ని పరిరక్షించడంతో పాటు గ్రామస్తుల రాకపోకల దారిని ఆక్రమణల నుంచి కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తటాకం లక్ష్మణ్ అదనపు కలెక్టర్‌ను కోరారు.




