వ్యవసాయ విద్యార్థులకు వృత్తి అవకాశాలపై దిశానిర్దేశం..
ఒకే వేదికపై 24 మంది రంగ నిపుణులు
‘ది ఫార్మిస్ట్ సమ్మిట్–2026’లో సుమారు 300 మంది విద్యార్థులకు మార్గదర్శనం
కుత్బుల్లాపూర్, ఆగస్టు 30, (తెలంగాణ దిశ) : వ్యవసాయ విద్యార్థులకు ఆధునిక వృత్తి అవకాశాలను పరిచయం చేయడంతో పాటు, రైతులకు క్షేత్ర స్థాయిలో నాణ్యమైన సాంకేతిక మార్గదర్శనం అందించే నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో నవ నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ‘ది ఫార్మిస్ట్ సమ్మిట్–2026’ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా భారతదేశంలోనే తొలిసారిగా ‘అగ్రి డాక్టర్ ఉద్యమం’కు నాంది పలికినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది, వెన్నెల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుంకర నరేష్ హాజరై మాట్లాడారు. తాను రైతు బిడ్డగా, రైతుల కష్టాలను ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తిగా ఈ వేదికకు వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహా ఆధునిక సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైతులు కూడా సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఎండ్రిన్ వంటి ప్రమాదకరమైన పురుగు మందుల వినియోగంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు పునరావృతం కాకూడదని ఆయన అన్నారు. రైతులకు సరైన సమయంలో సరైన సలహాలు అందించేందుకు శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన వ్యవసాయ నిపుణుల అవసరం ఎంతో ఉందన్నారు. ఇంటర్నెట్లో ‘రైతు’ అని వెతికితే బక్కచిక్కిన రైతు ఆకాశం వైపు చూస్తున్న దృశ్యమే కనిపించే పరిస్థితి మారాలని, రైతు అంటే సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి సాధిస్తున్న ఆధునిక వ్యవసాయదారుడిగా ప్రపంచానికి కనిపించేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ కోర్సుల వైపు మరింతగా ఆకర్షితులు కావాలని సుంకర నరేష్ పిలుపు నిచ్చారు. వ్యవసాయ విద్యను కేవలం ఉద్యోగానికి పరిమితం చేయకుండా, రైతులకు సేవ చేయడంతో పాటు స్వయం ఉపాధి, అగ్రి బిజినెస్, సాంకేతిక వ్యవసాయం వంటి విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సదస్సులో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 24 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు, అభ్యుదయ రైతులు, అగ్రి బిజినెస్ ప్రతినిధులు, వృత్తి మార్గదర్శకులు పాల్గొన్నారు. వీరు వ్యవసాయ విద్యార్థులు, యువ వ్యవసాయ నిపుణులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, అగ్రి బిజినెస్, ఉపాధి అవకాశాలు, రైతులకు క్షేత్రస్థాయి సలహాలు అందించే విధానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సుమారు 300 మంది వ్యవసాయ విద్యార్థులు, యువ వ్యవసాయ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిపుణుల సూచనలు, మార్గదర్శకాలను పొందారు. వ్యవసాయ రంగంలో విద్యావంతులైన యువతకు కొత్త అవకాశాలను పరిచయం చేయడంతో పాటు, రైతు సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపగల ‘అగ్రి డాక్టర్ల’ను తయారు చేయడమే ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. రైతు–వ్యవసాయ నిపుణుల మధ్య సాంకేతిక వారధిని బలోపేతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నవ నిర్మాణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు రాంబాబు పొన్నాన, ఉపాధ్యక్షురాలు అడ్వకేట్ సాయి జ్యోతి యు. జగదీశ్వరరావు పొన్నానతో పాటు సంస్థ సభ్యులు సమన్వయంతో నిర్వహించారు. వ్యవసాయ విద్యార్థులు, యువ నిపుణులకు వృత్తిపరమైన దిశానిర్దేశం అందించిన ఈ సదస్సు వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలకు వేదికగా నిలిచింది.




