12వ వార్షికోత్సవ సంచికను ఆవిష్కరించిన మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ పైజన్ మహమ్మద్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 04, (తెలంగాణ దిశ) : వికలాంగులలో చైతన్యం తీసుకురావడంతో పాటు వారి హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు వికలాంగుల వాయిస్ మాస పత్రిక చేస్తున్న కృషి అభినందనీయమని మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ పైజన్ మహమ్మద్ అన్నారు. శుక్రవారం వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12వ వార్షికోత్సవ సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. వికలాంగుల సమస్యలు, హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పత్రిక చేస్తున్న కృషిని అభినందించారు. వికలాంగుల వాయిస్ 12వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పీఆర్ డి) రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల కోసం కొనసాగుతున్న ఏకైక మాస పత్రికగా వికలాంగుల వాయిస్ నిలుస్తోందన్నారు. గత 11 సంవత్సరాలుగా పత్రికను నిరంతరాయంగా నిర్వహిస్తూ వికలాంగుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. వికలాంగుల హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటాలకు వికలాంగుల వాయిస్ దిక్సూచిగా, మార్గదర్శిగా నిలుస్తోందని వెంకట్ అన్నారు. వికలాంగులకు సంబంధించిన చట్టాలు, హక్కులు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలు, అధికారిక సమాచారాన్ని వారికి చేరవేయడంలో పత్రిక కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వికలాంగుల్లో చైతన్యం తీసుకురావడానికి పత్రిక నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ షేన్ బేగం, జిల్లా కమిటీ సభ్యులు రమేష్, శివకుమార్, కోటయ్య, మేఘమాలతో పాటు నాయకులు భాను, శ్రీను తదితరులు పాల్గొన్నారు.




