రెండవ సారి కాప్రా సర్కిల్ సీసీఎస్ అధ్యక్షురాలిగా ఎంపల్లి పద్మారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
కుషాయిగూడ, నవంబర్ 22, (తెలంగాణ దిశ) :
కాలనీల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాలనీ సంఘాల సమాఖ్య (సీసీఎస్) నిరంతరం కృషి చేస్తుందని రెండవసారి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపల్లి పద్మారెడ్డి తెలిపారు. గత ఆరేళ్లుగా సీసీఎస్ ఆధ్వర్యంలో కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం కాప్రా సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీ సంఘాల సభ్యుల సమావేశం శివసాయినగర్లోని శివసాయి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కాలనీ సంఘాల సభ్యులంతా ఏకగ్రీవంగా ఎంపల్లి పద్మారెడ్డిని రెండోసారి సీసీఎస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ.. కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాలనీ సంఘాలన్నీ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే సీసీఎస్ పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత సమర్థవంతంగా కృషి చేస్తామని తెలిపారు.




