ఉత్తరాఖండ్‌లో బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలి
గాంధీభవన్‌లో శాంతియుత నిరసనకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పిలుపు
హైదరాబాద్, ఆగస్టు 31, (తెలంగాణ దిశ) : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఖండిస్తూ తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన ఘటనకు సంబంధించి రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. హల్ద్వానీ ర్యాలీ వేదిక వద్ద బీజేపీ–ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిర్వహించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్న కులతత్వ, వివక్షాపూరిత చర్యలను రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారని స్వర్ణ పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని తెలిపారు. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో రాహుల్ గాంధీపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని ఎర్రబెల్లి స్వర్ణ విమర్శించారు. కుల వివక్ష, దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలను కాంగ్రెస్ మహిళా విభాగం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లో ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని స్వర్ణ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటమే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు.




