Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణకుషాయిగూడ, రాధికా ఎక్స్ రోడ్స్ వద్ద రెండు ఫ్లై ఓవర్లు నిర్మించాలి

కుషాయిగూడ, రాధికా ఎక్స్ రోడ్స్ వద్ద రెండు ఫ్లై ఓవర్లు నిర్మించాలి

ఉప్పల్ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

-ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కుషాయిగూడ ఎక్స్ రోడ్స్, రాధికా ఎక్స్ రోడ్స్ వద్ద రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు రెండు ఫ్లై ఓవర్లను నిర్మించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు. కుషాయిగూడ, రాధికా చౌరస్తాలు ఈసీఐఎల్, కీసర, నాగారం తదితర ప్రాంతాలకు ప్రధాన అనుసంధాన కేంద్రాలుగా ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న నివాస ప్రాంతాలు, భారీగా పెరిగిన వాహనాల రాకపోకల కారణంగా ఈ రెండు ప్రధాన కూడళ్ల వద్ద ప్రతిరోజూ తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనివల్ల సమయం, ఇంధనం వృథా కావడంతో పాటు వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతోందని పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రమాదాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కుషాయిగూడ చౌరస్తా వద్ద ఒక ఫ్లైఓవర్, రాధికా చౌరస్తా వద్ద మరో ఫ్లైఓవర్ నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. ఈ రెండు ఫ్లై ఓవర్లు నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సాఫీగా సాగడంతో పాటు ప్రమాదాలు తగ్గుతాయని, కీసర, నాగారం, కుషాయిగూడ, ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల దీర్ఘకాలిక రవాణా సమస్యకు పరిష్కారం చూపే ఈ రెండు కీలక ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, త్వరితగతిన మంజూరు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.