హైదరాబాద్, సెప్టెంబర్ 29, (తెలంగాణ దిశ) :
అయోధ్యలో అక్టోబర్ 4,5 తేదీల్లో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) (ఎన్‌యూజే–ఐ) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంతో పాటు యూనియన్ కౌన్సిల్ సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎన్‌యూజే–ఐ జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ తెలిపారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నట్లు వారు పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు సమర్పించేందుకు సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఎంయూజే(ఐ) జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి త్రియుగ్ నారాయణ్ తివారీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీఎస్‌జేయూ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో , ఎన్‌యూజే–ఐ ప్రతినిధులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలిపారు.




