ఎస్‌ఐతో పాటు 10 మంది కానిస్టేబుళ్ల బదిలీ..
ముగ్గురు కొత్త ఎస్‌ఐల నియామకం
కీసర, నవంబర్ 14, (తెలంగాణ దిశ) :
కీసర పోలీస్ స్టేషన్‌లో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు భారీ స్థాయిలో బదిలీలు, నియామకాలు చేపట్టారు. ఇటీవల వరుసగా చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలు, ఏసీబీ దాడుల నేపథ్యంలో శాఖాపరంగా ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రెండు రోజుల క్రితం ఎస్‌ఐ నాగరాజుతో పాటు మరో పది మంది కానిస్టేబుళ్లను సౌత్ జోన్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండు నెలల క్రితం కీసర పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ, ఎస్‌ఐలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన మరువకముందే వారం రోజుల క్రితం మరో ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీకి చిక్కడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు బదిలీల ద్వారా ప్రక్షాళన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు సెక్టార్లకు కొత్తగా ముగ్గురు ఎస్‌ఐలను నియమించారు. కీసర సెక్టార్‌కు వెంకట్ రెడ్డి, నాగారం సెక్టార్‌కు గౌరేందర్ గౌడ్, చీర్యాల్ సెక్టార్‌కు ప్రభాకర్‌ను నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. వరుస పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ బదిలీలు, కొత్త నియామకాలతో కీసర పోలీస్ స్టేషన్‌లో పరిపాలనాపరంగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.




