Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణచెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు సేవలు చిరస్మరణీయం

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు సేవలు చిరస్మరణీయం

తొర్రూరు, ఆగస్టు 16, (తెలంగాణ దిశ) : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు పాలకుర్తి (పాత చెన్నూరు) నియోజకవర్గానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డి అన్నారు. దుగ్యాల శ్రీనివాసరావు 62వ జయంతి సందర్భంగా దుగ్యాల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, కీర్తిశేషులు దుగ్యాల శ్రీనివాసరావు 62వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం విశ్రాంతి భవన్‌లో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వెల్తూరి మల్లేశం, మిట్టకోల లక్ష్మణ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుగ్యాల ప్రజలకు విశేష సేవలందించడంతో పాటు ప్రతి వ్యక్తిని గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించే వారని అన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కార్యకర్తల కుటుంబాలతో కూడా ఆత్మీయ బంధాన్ని కొనసాగించిన మహోన్నత నాయకుడని కొనియాడారు. ఆయన జీవితం సేవా స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. దుగ్యాల శ్రీనివాసరావు పాత చెన్నూరు నియోజకవర్గంలో కేవలం 15 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొంది ఎమ్మెల్యేగా విజయం సాధించారని తెలిపారు. 2006 నుంచి 2009 వరకు నెల్లికుదురు, నర్సింహులపేట, తొర్రూరు, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని గుర్తుచేశారు. రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. విద్యతోనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందనే ఆలోచనతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాలని విద్యార్థులు చెట్ల కింద చదువుకునే పరిస్థితి ఉండకూడదనే లక్ష్యంతో అదనపు తరగతి గదులను మంజూరు చేయించి విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. తొర్రూరు పట్టణంలో ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కూడా ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా గుట్టపైకి సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. నెల్లికుదురు– బొడ్లాడ– బ్రాహ్మణ కొత్తపల్లి మధ్య ఆకేరు వాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేసి, ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచారని తెలిపారు. దుగ్యాల శ్రీనివాసరావు ఆశయాలను కొనసాగించి ఆయన జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దుగ్యాల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వెల్తూరి మల్లేశం, మిట్టకోల లక్ష్మణ్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎండి. ఆఅమీర్, సోమ హరిప్రసాద్, కృష్ణ, రవి, మంద యాకమల్లు, అశోక్ రెడ్డి, వినోద్ రెడ్డి, అంజన్న, దుగ్యాల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.