వంద ఉద్యోగాల భర్తీకి మెడ్‌ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో నియామకాలు
హైదరాబాద్, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) : ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలోని ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో, మెడ్‌ప్లస్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో యూఈఐజీబీ ఎంసీసీ కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మెడ్‌ప్లస్ గ్రూప్‌లో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ విభాగాల్లో మొత్తం 100 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీతో పాటు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 30 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చని యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో చీఫ్ టీ. రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన ఫార్మసిస్ట్‌లకు నెలకు రూ.25 వేల వరకు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్‌లకు నెలకు రూ.16 వేల వరకు వేతనం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో ఆగస్టు 25న నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో యూఈఐజీబీ ఎంసీసీ కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు మెడ్‌ప్లస్ గ్రూప్ హెచ్‌ఆర్ ప్రతినిధి శ్రీ సాయి శైలేష్‌ను 9666662481 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు కోరారు.




