జోనల్ కమిషనర్ రాధికా గుప్తా దృష్టికి తీసుకెళ్లిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) : రామంతాపూర్ డివిజన్ శారదానగర్‌లోని ఏడీఆర్‌ఎం గల్లీలో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్స్ సమస్య పరిష్కారం కాకపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. రోడ్డుకు సమానంగా మ్యాన్‌హోల్స్ లేకపోవడంతో వాటి చుట్టూ గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను జోనల్ కమిషనర్ రాధికా గుప్తా దృష్టికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీసుకెళ్లారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్స్‌ను రోడ్డుకు సమానంగా ఏర్పాటు చేసి, గుంతలను పూడ్చి ప్రమాదాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై జోనల్ కమిషనర్ రాధికా గుప్తా సానుకూలంగా స్పందించి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వరరావు పాల్గొన్నారు.




