సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
శేరిలింగంపల్లి, ఆగస్టు 25, (తెలంగాణ దిశ) : తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సిద్ధమయ్యే యువతకు టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక డిజిటల్ కంటెంట్ అందించేందుకు సిద్ధమైంది. పోలిస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే 7,437 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు సన్నద్దమయ్యే యువతకు డిజిటల్ పాఠ్యాంశాలను రూపొందించింది. ప్రసారాలకు సంబంధించిన వివరాలను టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో వివరించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి యువతకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో నియామకాల్లో వయస్సును సైతం సడలించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా యువతకు డిజిటల్ కంటెంట్ అందిస్తున్నామన్నారు. ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 11 నుండి ఒంటి గంట వరకు 12 సబ్జెక్ట్ లపై ఎక్స్ పర్ట్స్ చే ఐదు రోజుల పాటు ప్రత్యేక లైవ్ ప్రసారాలుంటాయని తెలిపారు. వీటితో పాటు సుమారు 600 గంటల రికార్డెడ్ కంటెంట్ విద్య ఛానల్ లో 24వ తేది సోమవారం ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు, నిపుణలో ఏడు నుండి తొమ్మిది గంటల వరకు పరీక్షలు నిర్వహించే తేది నాటికి ప్రసారాలు కొనసాగుతాయన్నారు. టి-సాట్ నెట్వర్క్ కు చెందిన శాటిలైట్, డిజిటల్ మాధ్యమాల ద్వారా పోలీస్ పోటీ పరీక్షల కంటెంట్ అందుబాటులో ఉంటుందని, మాక్ టెస్టులను సైతం నిర్వహిస్తుందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రసారాలను తెలంగాణ యువత సద్వినియోగం చేసుకొని రాబోయే పోటీపరీక్షల్లో రాణించాలని, ప్రసారాలు వీక్షించడంతో పాటు మాక్ టెస్టులను సైతం వినియోగించుకుని తమ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సీఈవో సూచించారు.




