Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణకాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బిఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బిఆర్‌ఎస్‌ సమరభేరి

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్‌, ఆగస్టు 27, (తెలంగాణ దిశ) :

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ బిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 1 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, 420 హామీల అమలు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, వికలాంగులు, భూముల సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ వరుస కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్‌ 1న తెలంగాణ భవన్‌లో కార్యక్రమాల లోగోను ఆవిష్కరించడంతో పాటు ఏడు రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలపై ప్రారంభ విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 2న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి, బహిరంగంగా కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు 420 అడుగుల ఫ్లెక్సీలను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్‌ 3న వ్యవసాయ రంగంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ రైతు నిరసనలు నిర్వహించడంతో పాటు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో ధర్నా చేపట్టనున్నారు. సెప్టెంబర్‌ 4న విద్యార్థులు, వికలాంగులు, మహిళలతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 5న విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టనున్నారు. సెప్టెంబర్‌ 6న ఆదిలాబాద్‌, హైదరాబాద్‌తో పాటు గ్రామస్థాయిలో వివిధ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 7న ప్రజావాణి కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలుపై వినతిపత్రాలను సమర్పించనున్నారు. సెప్టెంబర్‌ 8న జిల్లా కేంద్రాల్లో ఏడు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలపై విలేకరుల సమావేశాలు నిర్వహించి, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ నిరసన కార్యక్రమాలను బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.