Tuesday, October 13, 2026
spot_img
Homeతెలంగాణరాఖీ బంధంతో విద్యార్థుల్లో సోదరభావం.. దేశ రక్షణకు ఐక్యంగా నిలుద్దాం

రాఖీ బంధంతో విద్యార్థుల్లో సోదరభావం.. దేశ రక్షణకు ఐక్యంగా నిలుద్దాం

నాగారం సెరినిటీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

నాగారం, ఆగస్టు 27, (తెలంగాణ దిశ) :  అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు, పరస్పర రక్షణకు ప్రతీకగా రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) పండుగను జరుపుకుంటామని సెరినిటీ ముఖ్య కార్యదర్శి నోముల వసంత రెడ్డి పేర్కొన్నారు. రక్షాబంధన్‌ కేవలం సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి మాత్రమే కాకుండా, పరస్పర ప్రేమ, విశ్వాసం, బాధ్యత, రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. గురువారం నాగారంలోని సెరినిటీ పాఠశాలలో రక్షాబంధన్‌ వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాఖీ కట్టే సమయంలో “నీకు నేను రక్ష.. నాకు నీవు రక్ష.. మన ఇద్దరం దేశానికి రక్ష” అంటూ నినాదాలు చేస్తూ సోదర భావాన్ని చాటారు. ఈ సందర్భంగా నోముల వసంత రెడ్డి మాట్లాడుతూ హిందూ చాంద్రమాన క్యాలెండర్‌ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన్‌ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఈ పండుగ ద్వారా చిన్న నాటి నుంచే పిల్లల్లో ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం, బాధ్యతాయుతమైన ప్రవర్తన వంటి విలువలను పెంపొందించవచ్చునని పేర్కొన్నారు. రక్షాబంధన్‌ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు అండగా నిలుస్తామని, తోటి విద్యార్థులను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేయడం విశేషం. వ్యక్తిగతంగా ఒకరినొకరు రక్షించుకోవడంతో పాటు సమాజం, దేశం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, దేశ సమగ్రత, శాంతి, భద్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుకలతో విద్యార్థుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సోదరభావం, ఐక్యత, దేశభక్తి సందేశాన్ని చాటిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.