చిన్న విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలి
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
కాప్రా, ఆగస్టు 29 (తెలంగాణ దిశ) : జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచిన కాప్రా చెరువు సాధారణ నీటి వనరు మాత్రమే కాదని, నగర పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకమైన చిత్తడి నేల ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కాప్రా చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయడం సముచితం కాదని స్పష్టం చేశారు. చెరువు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు శుక్రవారం కాప్రా చెరువును సందర్శించిన ఆయన ఈ విషయాన్ని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్థానిక ప్రతినిధులకు వివరించారు. చిన్న విగ్రహాల నిమజ్జనానికి చెరువు సమీపంలోని బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులను కోరారు. కాప్రా చెరువు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన లక్ష్యాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పట్టణ చిత్తడి నేలల జాబితాలో కాప్రా చెరువు కూడా ఉందని రంగనాథ్ తెలిపారు. ఆస్ట్రేలియా, యూరప్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 470కుపైగా వలస పక్షులకు కాప్రా చెరువు ఆవాసంగా ఉందన్నారు. మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, పాఖల్ సరస్సు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణ, నిర్వహణ నిబంధనలు–2017 ప్రకారం చెరువుల హద్దులను నిర్ధారించడం, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడం, కాలుష్యం నుంచి రక్షించడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే 113 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాప్రా చెరువు అభివృద్ధి పనులను హైడ్రా చేపడుతోందన్నారు. వరద నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణ, వలస పక్షులకు ఆవాసం కల్పించడం వంటి పర్యావరణ అనుకూల అంశాలను దృష్టిలో ఉంచుకుని చెరువును అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. కాప్రా చెరువులో సుమారు 70 శాతం వరకు ప్రైవేట్ పట్టా భూములు ఉన్నప్పటికీ, ఆయా భూముల యజమానులు ముందుకు వచ్చి చెరువు అభివృద్ధికి సహకరిస్తున్నారని హైడ్రా కమిషనర్ తెలిపారు. చెరువును సంపూర్ణంగా అభివృద్ధి చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ కాప్రా చెరువు పునరుజ్జీవన బృందం ప్రతినిధులు రంగనాథ్‌ను కలిశారు. కాప్రా చెరువుకు వచ్చే వలస పక్షుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను హైడ్రా కమిషనర్ తిలకించారు. చెరువు పర్యావరణ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేలా చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. గణేష్ నిమజ్జనాల కారణంగా చెరువు పర్యావరణ వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, హైడ్రా సహాయ పోలీసు కమిషనర్ ఉమామహేశ్వర్రావు, చెరువు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్టర్ యూనస్ తదితరులు పాల్గొన్నారు.




