1000 రోజులు ఫామ్ హౌస్‌లో కేసీఆర్.. ప్రజల మధ్య ఒక్క రోజూ లేని కేసీఆర్” అనే నినాదంతో నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ
ప్రతి పక్ష హోదా ప్రజాసేవ కోసం.. ఫామ్ హౌస్ విశ్రాంతి కోసం కాదు
కేసీఆర్ వెంటనే ప్రతి పక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: కేశెట్టి ప్రసాద్
ఏఎస్ రావునగర్, సెప్టెంబర్ 02, (తెలంగాణ దిశ) : ప్రజలు అప్పగించిన బాధ్యతను విస్మరించిన మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగేందుకు నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో, ప్రజల మధ్య చురుకుగా పనిచేయాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ
ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జీ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఉదయం 10 గంటలకు సైనిక్‌పురి చౌరస్తాలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి ఈసీఐఎల్ క్రాస్‌రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కేశెట్టి ప్రసాద్ తెలిపారు. “1000 రోజులు ఫామ్ హౌస్‌లో కేసీఆర్.. ప్రజల మధ్య ఒక్క రోజూ లేని కేసీఆర్” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష హోదా ప్రజా సేవ కోసం ఉపయోగించాల్సింది తప్ప, విశ్రాంతి కోసం కాదని అన్నారు. ప్రజల సొమ్ముతో కోట్ల రూపాయల సదుపాయాలు పొందుతూ, ప్రజల సమస్యలపై బాధ్యత వహించకపోవడం సరికాదని విమర్శించారు. ప్రజల కోసం అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు ఎందుకని ప్రశ్నించారు. “ఫామ్ హౌస్ రాజకీయాలు కాదు.. ప్రజా పోరాటాలే నిజమైన ప్రతిపక్ష ధర్మమని పేర్కొంటూ కేసీఆర్ వెంటనే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బైక్ ర్యాలీలో ఏఎస్ రావునగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేశెట్టి ప్రసాద్ పిలుపు నిచ్చారు.




