కుషాయిగూడ ప్రఖండలో ఘనంగా విశ్వ హిందూ పరిషత్ స్థాపన వేడుకలు
కుషాయిగూడ, సెప్టెంబర్ 09, (తెలంగాణ దిశ) : విశ్వ హిందూ పరిషత్ స్థాపన వేడుకలను కుషాయిగూడ ప్రఖండలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అణుశక్తి జిల్లా సంయోజక్ పూజ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. కార్యక్రమానికి తెలంగాణ మాతృ శక్తి సంయోజక్ పద్మశ్రీ, తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ సునీత రాంమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఆడపిల్లల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, మత మార్పిడులు జరగకుండా సమాజంలో అవగాహన కల్పించాలని సూచించారు. నేటి తరం పిల్లలకు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, పెద్దలపై ఉందన్నారు. పిల్లలను చిన్ననాటి నుంచే భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాల పట్ల అవగాహన కలిగించేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. సమాజంలో ఐక్యత, ధార్మిక చైతన్యం పెంపొందించడంతో పాటు యువత, బాల బాలికలలో భారతీయ విలువలను పెంపొందించేందుకు సేవా కార్యక్రమాలు, సంస్కార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ప్రఖండ బాల సంస్కార కేంద్ర ప్రముఖ్ జ్యోతి, మణి తదితరులతో పాటు హిందూ బంధువులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ధార్మిక, సామాజిక అంశాలపై చర్చించి, హిందూ సమాజ ఐక్యత కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.




