Monday, October 12, 2026
spot_img
Homeఆధ్యాత్మికంకాప్రా చెరువులో గణేష్‌ నిమజ్జనానికి అనుమతించాలని కింద కూర్చొని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ఆందోళన

కాప్రా చెరువులో గణేష్‌ నిమజ్జనానికి అనుమతించాలని కింద కూర్చొని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ఆందోళన

నిమజ్జనానికి అనుమతి లేదన్న డీసీ.. త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు

 

ఏఎస్‌ రావునగర్‌, సెప్టెంబర్‌ 09, (తెలంగాణ దిశ) : కాప్రా చెరువులో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తమైంది. ఏఎస్‌ రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని భవానీనగర్‌ కమ్యూనిటీ హాల్ లో కాప్రా సర్కిల్‌ అధికారులు ఏర్పాటు చేసిన గణేష్‌ ఉత్సవ సమితి సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాప్రా చెరువులో గణేష్‌ నిమజ్జనాలకు అనుమతించాలని కోరుతూ భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి నాయకులు సమావేశం సందర్భంగా కింద కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిమజ్జనాలపై అధికారులు తమ నిర్ణయాన్ని స్పష్టం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సమావేశానికి కాప్రా డిప్యూటీ కమిషనర్‌ రవీంద్ర సాగర్‌తో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. కాప్రా చెరువులో గణేష్‌ నిమజ్జనాలకు ప్రస్తుతం అనుమతించే అవకాశం లేదని డిప్యూటీ కమిషనర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే నిమజ్జనాల అంశంపై త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, నిమజ్జనానికి అనుమతి కోరుతూ భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు నిరసనకు దిగడంతో సమావేశంలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనికి పోటీగా కాంగ్రెస్‌ నాయకులు “జై బోలో గణేష్‌ మహారాజ్‌” అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప జేశారు. అనంతరం పరిస్థితి అదుపులోకి రావడంతో సమావేశాన్ని కొనసాగించారు. దీంతో భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు సమావేశాన్ని బహిష్కరించి భవాని నగర్ కమ్యూనిటీ హాల్ ఎదురుగా అధికారుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. కాప్రా చెరువులో గణేష్‌ నిమజ్జనాల నిర్వహణపై త్వరలో నిర్వహించనున్న సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.