వరుసగా నాలుగవ సారి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 25, (తెలంగాణ దిశ) :
వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్గా పెద్దాపురం కుమారస్వామిని ప్రభుత్వం వరుసగా నాలుగవ సారి నియమించింది. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్లు రత్నాల కనకయ్య, గుమ్మడి రాజు యాకయ్య, సకినాల రవి, ముంజంపల్లి రాములు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దాపురం కుమారస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వరుసగా నాలుగవ సారి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం వంటి ఆశయాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. రజక సమాజ అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ, సామాజిక గౌరవం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. చిట్యాల ఐలమ్మ జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, ఉత్సవ కమిటీ సభ్యులు, రజక సంఘాల ప్రతినిధులు, ప్రజల సహకారంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తామని కుమారస్వామి పేర్కొన్నారు.




