Sunday, October 11, 2026
spot_img
Homeతెలంగాణరేవంత్ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి

రేవంత్ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి

లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు 

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

ఉప్పల్, సెప్టెంబర్ 29, (తెలంగాణ దిశ) : 

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శ్రీరాముడు, పరమ శివుడిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి సుభాష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఉప్పల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హిందూ సమాజంలో విభేదాలకు దారితీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరాముడు, శివుడిని ప్రస్తావిస్తూ ఉత్తర, దక్షిణ భారత దేశాల రాజకీయ, మత పరమైన గుర్తింపుల మధ్య పోలికలు చేస్తూ రాముడు సంపన్నులకు, శివుడు పేదలకు సంబంధించిన దేవుళ్లుగా పేర్కొనటం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. హిందూ ధర్మంలో శ్రీరాముడు, పరమశివుడు పరస్పర విరోధులుగా కాకుండా భక్తులచే ఆరాధించబడే దైవ స్వరూపాలని అన్నారు. దేవుళ్లను రాజకీయ చర్చల్లోకి తీసుకువచ్చి సమాజంలో విభజనకు దారితీసే పరిస్థితులు ఏర్పడకూడదని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత కలిగి ఉంటారని, ప్రజల మధ్య ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించేలా మాట్లాడాల్సిన అవసరం ఉందని సుభాష్ రెడ్డి అన్నారు. రాజకీయ విమర్శలు చేయడానికి అనేక అంశాలు ఉన్నప్పటికీ, దేవతలను ప్రస్తావిస్తూ వర్గాలు, ప్రాంతాల మధ్య భేదాలను చూపించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సుభాష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని బేతి సుభాష్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ అన్ని వర్గాల మధ్య సోదరభావం, సామరస్యాన్ని కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.