32,976 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ నిధుల విడుదల
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫీజు బకాయిలకు మరో రూ.14.68 కోట్లు
హైదరాబాద్, అక్టోబర్ 13, (తెలంగాణ దిశ) :
రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద 32,976 మంది విద్యార్థులకు మొత్తం రూ.204.40 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన 40 శాతం వాటాగా రూ.101.44 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటాగా రూ.102.96 కోట్లు విడుదల చేసినట్లు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కళాశాలల నుంచి అందుతున్న పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అర్హత ఉన్న విద్యార్థులకు దశలవారీగా స్కాలర్షిప్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా, స్కాలర్‌షిప్‌ల చెల్లింపులు సకాలంలో జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం
ఆర్థిక పరిస్థితులు కారణంగా ఏ ఒక్క ఎస్సీ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్కాలర్షిప్ ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వ సహాయం అందేలా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు రూ.14.68 కోట్లు
ఇదిలా ఉండగా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.14.68 కోట్లను విడుదల చేసింది. విద్యార్థుల విద్యకు సంబంధించిన ఫీజు బకాయిలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని మంత్రి తెలిపారు. విద్యార్థుల విద్య, సంక్షేమానికి అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు, అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా తెలంగాణ ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పష్టం చేశారు.




