హైదరాబాద్, అక్టోబర్ 13, (తెలంగాణ దిశ) :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన గాంధీ భవన్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు హాజరుకానున్నారని తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, ప్రకృతితో ముడిపడిన మన సంప్రదాయాలకు ప్రతీక అని ఎర్రబెల్లి స్వర్ణ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించడంతో పాటు మహిళల ఐక్యతను చాటిచెప్పేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని ఎర్రబెల్లి స్వర్ణ సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై బతుకమ్మ పండుగ విశిష్టతను చాటాలని ఆమె కోరారు.




