చర్లపల్లి, నవంబర్ 06, (తెలంగాణ దిశ):
చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సుమారు 2 వేల పరిశ్రమలు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామిక వాడలో పారిశ్రామిక వేత్తలు, దాతల సహకారంతో చర్లపల్లి ఇండస్ట్రియలిస్ట్స్ అసోసియేషన్ (సీఐఏ) ఆధ్వర్యంలో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన అధునాతన క్రీడా సముదాయంతో పాటు ఈఎస్ఐ డిస్పెన్సరీని రాష్ట్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, సమాచార ప్రసారాలు, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలతో కలిసి ఈటెల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించేలా పరిశ్రమల యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. చదువులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న యువతకు అవసరమైన నైపుణ్యాలను (స్కిల్ డెవలప్మెంట్) అందించాల్సిన బాధ్యత పరిశ్రమలపై కూడా ఉందన్నారు. ఇందుకోసం చర్లపల్లి పారిశ్రామికవేత్తలందరూ కలిసి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘నషా ముక్త్ భారత్’ సంకల్పంతో దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ డ్రగ్స్ సరఫరాను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో కూడా మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తూ, యువతను ఈ వ్యసనాల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తోందని, ఈ అవకాశాలను వినియోగించుకుని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు.




