రూ.10 కోట్లతో మురుగునీరు, వర్షపు నీటి కాల్వల నిర్మాణాలకు శంకుస్థాపన
శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 17, (తెలంగాణ దిశ) :
మేడ్చల్ నియోజకవర్గంలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అత్తివెల్లిలోని జీఎన్‌ఆర్ కన్వెన్షన్‌లో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4 లక్షల 63 వేల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
అనంతరం తుమ్ముకుంటలోని ఇందిరమ్మ ఇళ్ల పరిసర ప్రాంతాల్లో రూ.5 కోట్ల నిధులతో మురుగునీరు, వర్షపు నీటి ప్రవాహ కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ ఆర్జీకే కాలనీలో మరో రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మురుగునీరు, వర్షపు నీటి ప్రవాహ కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం రూ.10 కోట్ల నిధులతో కాల్వల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు అందించడంతోపాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొత్తగా మంజూరైన 4 లక్షల 63 వేల చేయూత పింఛన్ల ద్వారా ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఈ నెల 19వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమల్లోకి రానుందని తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబ యజమానికి ఈ పథకం ద్వారా బీమా రక్షణ కల్పించనున్నట్లు వెల్లడించారు. కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, జోనల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు పాల్గొ
న్నారు.




