మేడ్చల్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) : ప్రజలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని కార్యాలయాలకు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 22ఏ నిషేధిత భూముల జాబితాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా క్లియర్ చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సబ్రిజిస్ట్రార్లు, తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం మేడ్చల్ మండలంలోని సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించి 22ఏ జాబితాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్డేట్ చేసిన జాబితా ప్రకారం ప్రజలకు సేవలు అందించాలని, రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే నాటికే సంబంధిత ఆస్తులకు 22ఏ క్లియరెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మేడ్చల్, దుండిగల్ తహసీల్దార్ల వద్ద ఉన్న 22ఏ జాబితాలోని ప్రతి దరఖాస్తును సర్వే నంబర్‌తో సహా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న జాబితాలతో సరిపోల్చి పరిశీలించారు. 22ఏ నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కలెక్టర్ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. లింక్ డాక్యుమెంట్ల ఆధారంగా పూర్తి స్థాయిలో పరిశీలన, ధ్రువీకరణ చేపట్టాలని, యూఎల్సీ కేసులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించి అర్హత ఉన్న దరఖాస్తులను నిషేధిత భూముల జాబితా నుంచి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూఎల్‌సీలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సెక్షన్ 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన సమస్యలపై కలెక్టర్ అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. స్లాట్ బుక్ అయిన తర్వాత డాక్యుమెంట్లు పెండింగ్‌లో ఉండకుండా సబ్రిజిస్ట్రార్లతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు సులభంగా, ఎలాంటి జాప్యం లేకుండా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ అశోక్, మేడ్చల్ తహసీల్దార్ భూపాల్, దుండిగల్ తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




