Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణఈ నెల 26న వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12వ వార్షికోత్సవాలు

ఈ నెల 26న వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12వ వార్షికోత్సవాలు

హైదరాబాద్, ఆగస్టు 21, (తెలంగాణ దిశ) : వికలాంగుల హక్కులు, సమస్యలు, సంక్షేమ పథకాలపై చైతన్యం కల్పిస్తూ కొనసాగుతున్న వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12వ వార్షికోత్సవ ఉత్సవాలను ఈ నెల 26న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం ఒకటింటికి నిర్వహించనున్నట్లు పత్రిక గౌరవ సలహాదారులు పి. ఉమ్మర్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా “రాజ్యాంగ హక్కులు – భావప్రకటన స్వేచ్ఛ – సవాళ్లు” అనే అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వార్షికోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల ప్రాంగణంలో పి. ఉమ్మర్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల వాయిస్ మాస పత్రిక ఎడిటర్ ఎం. అడివయ్య, మేనేజర్ కె. వెంకట్, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్, హెలెన్ కెల్లర్ రిహాబిలిటేషన్ సంస్థ డైరెక్టర్లు అర్ముగం, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మర్ ఖాన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వికలాంగుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్న ఏకైక మాస పత్రికగా వికలాంగుల వాయిస్ కొనసాగుతోందన్నారు. గత 11 ఏళ్లుగా పత్రిక నిరంతరాయంగా ప్రచురితమవుతూ వికలాంగుల హక్కుల కోసం సాగుతున్న పోరాటాలకు దిక్సూచిగా నిలుస్తోందని తెలిపారు. వికలాంగులు తమ హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటాలకు పత్రిక మార్గదర్శిగా వ్యవహరిస్తోందన్నారు. చట్టాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమాచారాన్ని వికలాంగులకు చేరవేయడంలో వికలాంగుల వాయిస్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వికలాంగులను చైతన్యవంతులను చేయడానికి పత్రిక నిరంతరం కృషి చేస్తోందన్నారు. వికలాంగుల చేతిలో వికలాంగుల వాయిస్ ఒక బలమైన సాధనంగా నిలుస్తోందని అన్నారు. మేనేజర్ కురునెల్లి వెంకట్ మాట్లాడుతూ వికలాంగుల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగ పరిరక్షణపై జరిగే ఈ సెమినార్‌కు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.