Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై కీలక సమీక్ష

ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై కీలక సమీక్ష

వర్గీకరణ ముసాయిదాపై చర్చ.. త్వరలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం

హైదరాబాద్, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) : 

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కీలక సమీక్ష నిర్వహించింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13 వేల మందికిపైగా ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, వివిధ జేఏసీలతో నిర్వహించిన విస్తృత సంప్రదింపుల్లో వచ్చిన అభిప్రాయాలు, విజ్ఞప్తుల ఆధారంగా రూపొందించిన ముసాయిదా నోట్‌పై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

ఐదు విభాగాలుగా ఉద్యమకారుల గుర్తింపు

క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం ఆధారంగా ఉద్యమకారులను వివిధ కేటగిరీలుగా గుర్తించే విధానాన్ని కమిటీ ప్రాథమికంగా పరిశీలించింది. ఇందులో ఉద్యమ సమయంలో అమరులైన వారి కుటుంబాలను మొదటి కేటగిరీగా, పోలీసు కాల్పులు, లాఠీచార్జీలు, ఇతర ఘటనల్లో శాశ్వత అంగవైకల్యం పొందిన క్షతగాత్రులను రెండో కేటగిరీగా ప్రతిపాదించారు. 1969 తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో జైలు జీవితం గడిపిన విద్యార్థులు, ఉద్యమకారులను మూడో కేటగిరీలో, ఉద్యమ సమయంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న వారిని నాలుగో కేటగిరీలో చేర్చే అంశంపై చర్చించారు. కేసులు నమోదు కాకపోయినా ఉద్యమ నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా ఉద్యమకారులు, ధూమ్‌ధామ్ కళాకారులు, వివిధ సంస్థల సభ్యులకు ప్రత్యేక కేటగిరీలను పరిశీలించారు.

సత్కారం, సహాయం, సహకారమే లక్ష్యం

ఉద్యమకారులకు సత్కారం, సహాయం, సహకారం అందేలా సంక్షేమ విధానాలను రూపొందించాలని కమిటీ అభిప్రాయపడింది. ఉద్యోగులు, ఆర్థికంగా స్థిరపడిన వారు గుర్తింపు కార్డు లేదా ప్రశంసాపత్రం కోరుతుండగా, నిరుపేదలు, నిరుద్యోగ యువత 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణానికి ఆర్థిక సాయం, పెన్షన్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, పిల్లలకు ఉచిత విద్య, స్వయం ఉపాధి రుణాలు వంటి పలు డిమాండ్లను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. అమరుల కుటుంబాల్లో గతంలో సహాయం అందని అర్హులను గుర్తించి న్యాయం చేయడంతో పాటు, జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో సంక్షేమ పథకాలకు చట్టబద్ధత కల్పించాలని, శాశ్వత కమిషన్ లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వచ్చిన సూచనలపైనా సమావేశంలో చర్చించారు.

త్వరలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

ఉద్యమకారులు దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో అధికారిక వెబ్‌సైట్/పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. పారదర్శకమైన ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని రూపొందించడంతో పాటు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో విస్తృతంగా చర్చలు జరపాలని నిర్ణయించారు. మిగిలిన ప్రజా సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు పూర్తి చేసి, ఇప్పటివరకు నిర్వహించిన అన్ని చర్చల వివరాలు, మినిట్స్‌తో సమగ్ర నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సమర్పించనున్నట్లు కమిటీ వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.