ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి
ఉప్పల్, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) : ఉప్పల్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌తో పాటు సమగ్ర డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు. ఉప్పల్ నియోజకవర్గ జనాభా వేగంగా పెరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో ప్రస్తుతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్, పూర్తి స్థాయి ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్ అందుబాటులో లేవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు సీబీసీ, బ్లడ్ షుగర్, ఎల్‌ఎఫ్‌టీ, కేఎఫ్‌టీ, యూఎస్‌జీ తదితర ప్రాథమిక వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోందని, ఇది వారికి ఆర్థిక భారంగా మారుతోందన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన డయాగ్నస్టిక్ సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలో కాంపోనెంట్ సెపరేషన్ సదుపాయంతో కూడిన ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పాథాలజీ, రేడియాలజీ, అల్ట్రాసౌండ్ తదితర అత్యవసర వైద్య పరీక్షలు అందించేలా సమగ్ర ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్‌ను మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రెండు సదుపాయాలు అందుబాటులోకి వస్తే ఉప్పల్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండటంతోపాటు అవసరమైన వైద్య పరీక్షలు స్థానికంగానే నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులను ఆదేశించి బ్లడ్ బ్యాంక్, డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సాయి జెన్ శేఖర్, గంధం నాగేశ్వర్ రావు, జేట్ట కిషోర్ కుమార్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




