కుత్బుల్లాపూర్, ఆగస్టు 17, తెలంగాణ దిశ) : భౌరంపేటలో దళిత రైతుల భూముల సమస్యపై జరుగుతున్న ఆందోళనకు మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. సోమవారం దుండిగల్ భౌరంపేటలో ధర్నా చేస్తున్న దళిత రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత రైతులతో కలిసి వివాదాస్పద భూములను పరిశీలించారు. భౌరంపేటలోని సర్వే నంబర్లు 472, 166లో దళితులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని రైతులు ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువచ్చారు. ఐదు తరాలుగా ఈ భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని, పన్నులు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. తమ భూములను తమకే ఇవ్వాలని, లేదంటే తమ ప్రాణాలు తీసుకుని భూములు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పేదల భూములు గుంజుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. భూముల వ్యవహారంలో రేవంత్‌రెడ్డి రీసెర్చ్ స్కాలర్‌గా మారారని, పేదల భూములను ఎలా గుంజుకోవాలనే విషయంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారని విమర్శించారు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి తప్ప రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ల వ్యక్తిగత ఆస్తి కాదన్నారు. దళితులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను తిరిగి లాక్కోవడం అన్యాయమని పేర్కొన్నారు. “కన్నతల్లి లాంటి భూ తల్లిపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు..?” అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోగా, ఉన్న భూములు కూడా పోయే పరిస్థితి ఏర్పడిందని ఈటల విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పేదల భూములపై ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు. పేదల భూములను స్వాధీనం చేసుకోవద్దని, ప్రభుత్వానికి భూమి అవసరమైతే బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యామ్నాయ మార్గం చూడాలని సూచించారు. భౌరంపేట దళిత రైతులకు ఎంపీగా, భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిస్థాయిలో అండగా ఉంటానని ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. పేదల కళ్లలో కన్నీళ్లు వస్తే తన కళ్లలో వచ్చినట్టేనని అన్నారు. పేదలను ఇబ్బంది పెడితే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. పేదల భూములను గుంజుకుంటున్న ప్రభుత్వాన్ని బీజేపీ నిలదీస్తుంది. పేదలకు అన్యాయం జరిగితే మీ మెడలు వంచుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డికి పాలనలో అనుభవం లేదనుకున్నామని, అయితే పేదల భూములను గుంజుకునే విషయంలో మాత్రం రీసెర్చ్ స్కాలర్‌గా మారారని విమర్శించారు. ధరణి పేరుతో పేదల భూములకు ఇబ్బందులు కలిగించిన గత ప్రభుత్వానికి కొనసాగింపుగా, కొత్త విధానాల పేరుతో పేదల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హైడ్రా పేరుతో అర్ధరాత్రి ఫెన్సింగ్‌లు వేస్తూ పేదలను భయభ్రాంతులకు గురిచేయవద్దని అన్నారు. “ప్రభుత్వం అంటే ల్యాండ్ బ్రోకరా? భూములు అమ్ముకునే కంపెనీనా?” అని ప్రశ్నించారు. భౌరంపేట దళిత రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారి పక్షాన బీజేపీ పోరాడుతుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గిరివర్ధన్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి కృష్ణారెడ్డి, భౌరంపేట మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ, సుధాకర్ గాండే, వాసు, రాజిరెడ్డి, మల్లేష్, సతీష్, శివాజీ, ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి, జంగారెడ్డి, రామచంద్రారెడ్డి, రైతులు జీతారం, వీరయ్య, జీతయ్య, బలరాం, బాలేష్ తదితరులు హాజరయ్యారు.




