కాప్రా, ఆగస్టు 21, (తెలంగాణ దిశ) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం కాప్రా మున్సిపల్ సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావునగర్ డివిజన్ కమలానగర్, మహేష్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పట్టణ హరిత హారం, వాణిజ్య లైసెన్సులు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల సందర్భంగా రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించకపోవడం, కేబుల్ వైర్ల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలను కమిషనర్ పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్‌ఎఫ్‌ఏ) వంశీపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఆయనను అక్కడి నుంచి మార్చాలని, గతంలో అదే ప్రాంతంలో పని చేసిన ఇన్‌చార్జ్ ఎస్‌ఎఫ్‌ఏ అంజలిని ఆ స్థానంలో నియమించాలని డిప్యూటీ కమిషనర్ రవీంద్రసాగర్‌ను ఆదేశించారు. కమలానగర్ రోడ్ నంబర్ 3లోని నిఖిల్ బాయ్స్ హాస్టల్‌ను కమిషనర్ తనిఖీ చేశారు. పార్కింగ్ ప్రాంతాన్ని కప్పి వేస్తూ వంటగది, కార్యాలయ గదిని నిర్మించినట్లు గుర్తించారు. ఈ నిర్మాణంపై సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయ్యప్ప స్వామి ఆలయ రోడ్డులో పాఠశాల సమీపంలో రహదారి వంపు కారణంగా వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకురాగా, సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుని రహదారిని సరి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బందికి అవసరమైన పనిముట్లు, ఇతర సామగ్రి అందుబాటులో ఉన్నాయా, వాటిని ఎక్కడ నిల్వ చేస్తున్నారనే విషయాలను కూడా కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. రాధిక మల్టీప్లెక్స్ వద్ద ఫుట్‌పాత్‌ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణం, నిర్మాణ సామగ్రిని ఎక్కువ కాలం రోడ్లపై ఉంచిన అంశాలను కమిషనర్ పరిశీలించారు. ఫుట్ పాత్ ఆక్రమణలు, రోడ్లపై నిర్మాణ సామగ్రి నిల్వ చేయడం వంటి వాటిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. ఇళ్ల ముందు మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేసిన ప్లాంట్ బాక్సులను పరిశీలించిన కమిషనర్, వాటిలో తప్పనిసరిగా మొక్కలు నాటేలా ఇంటి యజమానులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆయా ఇంటి యజమానులను పిలిపించి మొక్కలు నాటుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఆయా ప్రాంతాల్లో ప్లాంట్ బాక్సుల్లో మొక్కలు ఏర్పాటు చేసేలా పట్టణ హరిత విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలు దుకాణాలను తనిఖీ చేసి వ్యాపారులు తప్పనిసరిగా వాణిజ్య లైసెన్సులు కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి అధికారి, ఉద్యోగి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారులపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుద్ధ్యం, ప్రజా సౌకర్యాలు, రహదారులు, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తదితర అంశాలపై నిరంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్‌తో పాటు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్యం, రెవెన్యూ, పట్టణ హరిత విభాగాల అధికారులు, స్థానిక నివాస సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




