Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణకృష్ణా జలాలు తరలి పోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది?

కృష్ణా జలాలు తరలి పోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది?

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 14, (తెలంగాణ దిశ): కృష్ణా నదిలో నీటి లభ్యత ఉన్నప్పటికీ తెలంగాణకు దక్కాల్సిన నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకవైపు శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ వైపు నీరు తరలిపోతుంటే, మరోవైపు తెలంగాణ రైతుల కోసం నిర్మించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులు నీటి కోసం ఎదురుచూడటం ఏమిటని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్‌ నాయకులు జగదీష్‌రెడ్డి శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, బనకచర్ల వైపు ఉన్న నీటి తరలింపు వ్యవస్థ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్‌ ప్రాంతం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహం, కాలువల పరిమాణం, పంపింగ్‌ సామర్థ్యాలను పరిశీలిస్తూ తెలంగాణకు గతంలో జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు.పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలిస్తున్నామని చెబుతున్నప్పటికీ, అక్కడ కనిపిస్తున్న నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తే వాస్తవ పరిస్థితిపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు. నీటి ప్రవాహం వెడల్పు, వేగం, పరిమాణం ప్రజల కళ్లముందే కనిపిస్తున్నాయని, ప్రభుత్వం అధికారికంగా అక్కడి వాస్తవ నీటి ప్రవాహ వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. తెలుగు గంగ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తెలంగాణ జలహక్కులకు అన్యాయం ప్రారంభమైందని ఆరోపించారు. చెన్నై నగర తాగునీటి అవసరాలను ప్రధానంగా చూపుతూ ఎన్టీఆర్‌ హయాంలో ప్రారంభమైన పోతిరెడ్డిపాడు వ్యవస్థను అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం భారీ సామర్థ్యంతో విస్తరించిందని పేర్కొన్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌ వైపు పెద్ద మొత్తంలో నీటిని తరలించేందుకు భారీ సామర్థ్యంతో కాలువలు, రెగ్యులేటర్లు, పంపింగ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేస్తే, తెలంగాణ ప్రాంతంలోని కరువు భూములకు నీరందించే ప్రాజెక్టులకు మాత్రం పరిమిత సామర్థ్యంతో వ్యవస్థలు నిర్మించారని విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తే అప్పటి పాలకుల వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. తెలంగాణ రైతుల కోసం నిర్మించిన కల్వకుర్తి వ్యవస్థలో సుమారు 2,400 క్యూసెక్కుల మేర నీటిని తరలించే సామర్థ్యం మాత్రమే ఉండగా, మరోవైపు పోతిరెడ్డిపాడు పరిధిలో భారీ పరిమాణంలో నీటిని తరలించే వ్యవస్థలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. కృష్ణా నది తెలంగాణకు కూడా జీవనాడి అయినప్పటికీ, నీటిని వినియోగించుకునే మౌలిక వసతుల నిర్మాణంలో జరిగిన అసమానత వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. ఈ చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతోనే కేసీఆర్‌ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని భారీ సామర్థ్యంతో నిర్మించిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని భారీ పంపుల తరహాలోనే పాలమూరు–రంగారెడ్డి పథకంలో 145 మెగావాట్ల సామర్థ్యం గల భారీ పంపులను ఏర్పాటు చేశామని, రోజుకు రెండు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో ఈ వ్యవస్థను రూపొందించామని చెప్పారు. పాలమూరు ప్రాంతంలోని కరువు భూములకు శాశ్వతంగా సాగునీరు అందించాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని అన్నారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు–రంగారెడ్డి పథకంలోని నార్లాపూర్‌ రిజర్వాయర్‌తో పాటు పలు వ్యవస్థలను పరీక్షించి నీటిని ఎత్తిపోశామని గుర్తుచేశారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి లభ్యత ఉన్న సమయంలో కూడా ఆ భారీ పంపింగ్‌ వ్యవస్థను ఎందుకు వినియోగించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణకు నీటిని ఎత్తిపోసుకునే సామర్థ్యం, రిజర్వాయర్లు, భారీ పంపులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించకపోవడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. శ్రీశైలంలో నీరు ఉండగా పాలమూరు–రంగారెడ్డి పంపులు పనిచేయకపోవడం, మరోవైపు పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తరలిపోవడం తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. నీరు అందుబాటులో ఉన్న సమయంలోనే రిజర్వాయర్లను నింపి, సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని వినియోగించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ విషయంలోనూ నల్లగొండ జిల్లా ప్రజలకు ప్రభుత్వం పూర్తి వాస్తవాలను వివరించాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ పేరుతో దశాబ్దాలుగా నల్లగొండ ప్రజలకు హామీలు ఇస్తూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత నీటి సరఫరా వ్యవస్థ, నాగార్జున సాగర్‌ బ్యాక్‌ వాటర్స్‌ ఆధారంగా జరుగుతున్న నీటి వినియోగం, పూర్తి కావాల్సిన ఎస్‌ఎల్‌బీసీ వ్యవస్థపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు వెల్లడించాలని కోరారు. వర్షపాతంలో అనిశ్చితి, ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లో లభించే ప్రతి నీటి చుక్కను తెలంగాణ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాల్సిన అవసరం మరింత పెరిగిందన్నారు. నీరు అందుబాటులో ఉన్నప్పుడు ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపకపోతే భవిష్యత్తులో రైతులు ఎదుర్కొనే సాగునీటి ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నాగార్జునసాగర్‌ ఎడమకాలువ పరిధిలోని రైతులకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా జలాల లభ్యత పెరుగుతున్న సమయంలో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు రిజర్వాయర్లను నింపి, సాగునీటి అవసరాలను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. “పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు పరుగులు పెడుతుంటే తెలంగాణ వైపు భారీ సామర్థ్యం గల పంపులు మూగబోయి ఉన్నాయి. అక్కడ నీటి ప్రవాహం కనిపిస్తుంటే ఇక్కడ ఎత్తిపోతల వ్యవస్థలు పనిచేయకపోవడం ప్రస్తుత ప్రభుత్వ జలనీతికి అద్దం పడుతోంది” అని చింతల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రధాన లక్ష్యాల్లో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలను సరిదిద్దుకోవడం ఒకటని ఆయన అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను రాజకీయాలకు అతీతంగా పరిరక్షించాలని, శ్రీశైలంలో అందుబాటులో ఉన్న నీటిని తెలంగాణ ప్రాజెక్టులకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులను వెంటనే నడిపించి, కల్వకుర్తి సహా తెలంగాణ ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించాలని కోరారు. నాగార్జునసాగర్‌ ఎడమకాలువ రైతులకు సాగునీటి విడుదలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణకు దక్కాల్సిన నీటి చుక్క కూడా వృథా కాకుండా ప్రభుత్వం సమగ్ర జలవినియోగ ప్రణాళికను అమలు చేయాలని చింతల వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అవతలి రాష్ట్రం తన ప్రయోజనాల కోసం నీటిని తరలించుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ కూర్చోవడం పాలన కాదని, తెలంగాణ రైతు పొలానికి నీరు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.