కుషాయిగూడ పోలీసుల ఆధ్వర్యంలో మహిళలకు మట్టి విగ్రహాల పంపిణీ
కుషాయిగూడ, సెప్టెంబర్ 12, (తెలంగాణ దిశ) : వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కుషాయిగూడ పోలీసులు పర్యావరణహిత కార్యక్రమాన్ని చేపట్టారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుషాయిగూడ ఎస్హెచ్ఓ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు ఎన్. సుధాకర్ రెడ్డి, ఎం. విజయ్ పాల్గొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా సహజసిద్ధమైన మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. మట్టి విగ్రహాల వినియోగంతో పర్యావరణాన్ని, జల వనరులను పరిరక్షించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పోలీసులు కోరారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణహితంగా నిర్వహించాలని సూచించారు.




