భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి: కుషాయిగూడ పోలీసులు
కుషాయిగూడ, సెప్టెంబర్ 11, (తెలంగాణ దిశ) : వినాయక చవితి, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భక్తులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కుషాయిగూడ పోలీసులు విజ్ఞప్తి చేశారు. .ప్రతి గణేష్ మండపం వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద, అలాగే నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్‌ను వినియోగించరాదని స్పష్టం చేశారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు సమీపంలో గణేష్ మండపాలను ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిమజ్జన ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ప్రత్యేక అప్రమత్తత పాటించాలని పోలీసులు సూచించారు. మండపాలు, ఊరేగింపుల కారణంగా రహదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లు సులభంగా వెళ్లేందుకు తగినంత రహదారి మార్గాన్ని ఖాళీగా ఉంచాలని తెలిపారు. పోలీస్ శాఖ, సంబంధిత అధికారుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సహకరించాలని కుషాయిగూడ పోలీసులు కోరారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరి సహకారంతో వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.




