Friday, November 27, 2026
spot_img
Homeతెలంగాణసీనియర్ జర్నలిస్ట్ అవ్వారి రఘు కన్నుమూత

సీనియర్ జర్నలిస్ట్ అవ్వారి రఘు కన్నుమూత

నలభై ఏళ్లకు చేరువైన పాత్రికేయ ప్రస్థానం.. పలు పత్రికలు, టీవీ సంస్థల్లో విశిష్ట సేవలు

 

హైదరాబాద్, అక్టోబర్ 17, (తెలంగాణ దిశ) :

సీనియర్ జర్నలిస్ట్, రీజినల్ న్యూస్ అండ్ ఎనాలిసిస్ చీఫ్ ఎడిటర్ అవ్వారి రఘు కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతి పత్రికా రంగంలో విషాదాన్ని నింపింది. పాత్రికేయుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన రఘు మృతి పట్ల జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అవ్వారి రఘు 1986లో ఉదయం దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా తన పాత్రికేయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణ పత్రిక, వర్తమానం, నేటి నిజం, ఏపీ ఈఎంఎస్‌ వంటి పలు మీడియా సంస్థల్లో పనిచేశారు. ఆయా సంస్థల్లో తన ప్రతిభను చాటుతూ బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం టీవీ5లో చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌గా సేవలందించారు. ప్రస్తుతం రీజినల్ న్యూస్ అండ్ ఎనాలిసిస్ సంస్థకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు చేరువైన తన పాత్రికేయ ప్రస్థానంలో పలు మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు వార్తా రంగంలో విశేష అనుభవం ఉంది. సంప్రదాయ పత్రికా రంగం నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వరకు ఆయన తన సేవలను విస్తరించారు. అవ్వారి రఘుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్‌లోని కోకాపేటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు సంతాపం తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.