Friday, November 27, 2026
spot_img
Homeతెలంగాణడంపింగ్ యార్డ్ తరలింపుపై బీజేపీ వైఖరి ఏమిటి...?

డంపింగ్ యార్డ్ తరలింపుపై బీజేపీ వైఖరి ఏమిటి…?

రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర.. ప్రజా సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధి ఏదీ…?

కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జవహర్‌నగర్ ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలి: తోటకూర వజ్రేష్ యాదవ్

దమ్మాయిగూడ, అక్టోబర్ 29 (తెలంగాణ దిశ) :

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపుపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డ్ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను పరిష్కరించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పాదయాత్రలు చేయడం ఎంతవరకు సమంజసమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు.

గురువారం దమ్మాయిగూడలోని తిరుమల గార్డెన్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన ఈటల రాజేందర్ జవహర్‌నగర్ ప్రజలకు డంపింగ్ యార్డ్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సమయంలో డంపింగ్ యార్డ్ తరలింపుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉందని వజ్రేష్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు, సహకారం తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక ఎంపీగా ఈటల రాజేందర్‌పై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఎంపీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.

ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వజ్రేష్ యాదవ్ కోరారు. డంపింగ్ యార్డ్ తరలింపుపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించి, ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు. రాజకీయ విమర్శలు, పాదయాత్రలకే పరిమితం కాకుండా ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో డీసీసీ సభ్యులు, మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల అధ్యక్షులు, మున్సిపాలిటీల అధ్యక్షులు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.