దొంగతనంతో జీవనోపాధి కోల్పోయిన అంజమ్మకు రూ.5 వేల సాయం.. నాగారంలో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని విజ్ఞప్తి
నాగారం, నవంబర్ 05, (తెలంగాణ దిశ) :
మానవత్వమే మిన్న అనే భావనతో ఆపదలో ఉన్న నిరుపేద మహిళకు సామాజిక కార్యకర్త అక్కల సురేష్ కుమార్ తనవంతు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నాగారం డివిజన్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న దొంగతనాలు స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇందులో భాగంగా పది రోజుల క్రితం అన్నంరాజు అంజమ్మ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల నగదుతో పాటు, ఆమె జీవనోపాధికి ఆధారమైన ఇస్త్రీ పెట్టెను సైతం దొంగలు అపహరించుకుపోయారు. దీంతో అంజమ్మ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త అక్కల సురేష్ కుమార్ ఆమెకు అండగా నిలిచారు. సహాయం పొందేందుకు కూడా ఎంతో మొహమాటపడిన అంజమ్మ ఆత్మగౌరవాన్ని గౌరవిస్తూ, తనవంతు బాధ్యతగా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో బాధితురాలికి కొంతైనా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు. అదే విధంగా నాగారం డివిజన్‌లో దొంగతనాల నివారణకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచి ప్రజలకు భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను అక్కల సురేష్ కుమార్ కోరారు.




