Friday, November 27, 2026
spot_img
Homeతెలంగాణతెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు

తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు

చర్లపల్లిలో రూ.7 కోట్లతో అధునాతన క్రీడా సముదాయం ప్రారంభం

చర్లపల్లి, నవంబర్ 06, (తెలంగాణ దిశ) :

చర్లపల్లి పారిశ్రామికవాడలో పారిశ్రామికవేత్తలు, దాతల సహకారంతో చర్లపల్లి ఇండస్ట్రియలిస్ట్స్ అసోసియేషన్ (సీఐఏ) ఆధ్వర్యంలో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన అధునాతన క్రీడా సముదాయంతో పాటు ఈఎస్ఐ డిస్పెన్సరీని రాష్ట్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, సమాచార ప్రసారాలు, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు క్రీడలతో పాటు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల రహిత వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సమాంతరంగా సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఒప్పందం చేసుకుని ఇలాంటి క్రీడా సముదాయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. ఒక దేశం అభివృద్ధి చెందుతున్న స్థాయి నుంచి ఆర్థికంగా బలమైన దేశంగా ఎదగడానికి ఐదు, పదేళ్లు సరిపోవని, దశాబ్దాల పాటు నిరంతర కృషి అవసరమని మంత్రి పేర్కొన్నారు. 1982లో చర్లపల్లి పారిశ్రామికవాడ తొలి దశ ప్రారంభమైందని, ప్రస్తుతం ఐదు దశలకు విస్తరించడం ఈ ప్రాంత పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ ప్రణాళిక రూపకల్పనకు సుమారు తొమ్మిది నెలల పాటు అధ్యయనం చేసి, నీతి ఆయోగ్‌తో పాటు పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరిపినట్లు వివరించారు. ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ ఐదు శాతం వాటా కలిగి ఉందని, 2047 నాటికి ఈ వాటాను పది శాతానికి పెంచే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అనేక పరిశ్రమలు ఉన్నాయని, చర్లపల్లి పారిశ్రామికవాడ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలంటే పారిశ్రామికవేత్తలంతా ఒక వేదికపైకి వచ్చి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను యువతకు అందిస్తే స్థానికంగానే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని, తద్వారా పరిశ్రమలు కూడా మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. యువత జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని క్రీడలు, విద్య, ఉపాధి రంగాల్లో చురుకుగా పాల్గొనాలని ఎంపీ సూచించారు. సరైన మార్గదర్శకత్వం, లక్ష్యం లేకపోవడం వల్ల కొందరు యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని, పాఠశాలలు, కళాశాలలు, పారిశ్రామిక ప్రాంతాల్లో మత్తు పదార్థాల విక్రయాలు, చలామణిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దేశీయ తయారీ ప్రోత్సాహక కార్యక్రమాలతో పరిశ్రమలకు అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, హైదరాబాద్ పారిశ్రామిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చర్లపల్లి పారిశ్రామికవాడ కూడా మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. పరిశ్రమల అభివృద్ధి, యువత నైపుణ్యాభివృద్ధి, క్రీడా సదుపాయాలు సమన్వయంతో ముందుకు సాగితే ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అనంతరం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఆధునిక క్రీడా సముదాయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్రీడలు యువత శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని, ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. స్థానిక యువత, క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చిన ఈ క్రీడా సముదాయాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడారంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావడం మంచి పరిణామమని, ఇలాంటి కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులుగా తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు యువతకు క్రీడా సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి బాటలు వేయవచ్చని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె. సుధీర్ రెడ్డి, సీఎన్ఎంఐఏఎస్ఎస్ చైర్మన్ డాక్టర్ కె. గోవింద్ రెడ్డి, టీజీఐసీసీ జోనల్ మేనేజర్, కమిషనర్ బి. మధు, విఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రతినిధి రాము, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.