బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 17, (తెలంగాణ దిశ) : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు హబ్సిగూడ చౌరస్తాలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఎంతో మంది పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్న ఈ సంక్షేమ పథకాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ప్రజా సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలే నిలదీసే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తూ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాజీ కార్పొరేటర్లు జర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, కొత్త రామారావు, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సాయి జన్ శేఖర్, మైనార్టీ నాయకులు బదిరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




