కూకట్‌పల్లి, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్‌లో కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. టీడబ్ల్యూజెఎఫ్ కూకట్‌పల్లి అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను, సమాజంలోని వాస్తవ పరిస్థితులను తమ కెమెరా కళ్లతో ప్రపంచానికి పరిచయం చేస్తూ జర్నలిజంలో విశేష సేవలందిస్తున్న నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్, ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ మాచర్ల నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి వారికి అవార్డులను అందజేశారు. .ఈ సందర్భంగా ఎర్ర యాకయ్య మాట్లాడుతూ ఒక చిత్రం కోట్ల మాటలు మాట్లాడుతుందని, వేల ప్రశ్నలను సంధించి లక్షల సమాధానాలకు సమానంగా నిలుస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ఎలాంటి వక్రీకరణ లేకుండా ప్రజల ముందుకు తీసుకురావడంలో ఫోటో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. ఫోటో జర్నలిజం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, సమాజంలోని వాస్తవాలను భవిష్యత్ తరాలకు భద్రపరిచే బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అధికారుల దృష్టిని ఆకర్షించడంలో, సామాజిక మార్పుకు దోహదపడటంలో ఫోటో జర్నలిస్టుల చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పుట్టి నగేష్, టీడబ్ల్యూజెఎఫ్ కమిటీ సభ్యులు సుజాత, అనిల్ కిషోర్, శివ తదితరులు పాల్గొన్నారు.




