వేలాది మంది వసుంధర కళాశాల విద్యార్థినులతో గణనాథుడికి మహా హారతి
విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నృత్యాలు..
కుషాయిగూడ, సెప్టెంబర్ 23, (తెలంగాణ దిశ) :
కుషాయిగూడ టీజీఐఐసీ కాలనీ మైదానంలో యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మహా గణపతికి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, యువసేన యూత్ అసోసియేషన్ చైర్మన్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహా హారతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వసుంధర కళాశాలకు చెందిన వేలాది మంది విద్యార్థినులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రమిదలతో గణనాథుడికి మహా హారతి ఇవ్వడంతో మైదానం భక్తి పారవశ్యంతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై విద్యార్థినులతో కలిసి మహా గణనాథుడికి మహా హారతి సమర్పించారు. ఒకే సారి వేలాది మంది విద్యార్థినులు చేతుల్లో ప్రమిదలు పట్టుకుని గణపతికి హారతి ఇచ్చిన దృశ్యం కన్నులపండువగా కనిపించింది. మండపం పరిసరాలు గణపతి భజనలు, భక్తి గీతాలతో మార్మోగాయి. విద్యుత్ దీపాల అలంకరణ, భక్తుల సందడి, ప్రమిదల వెలుగులతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహా హారతి అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విద్యార్థినులతో కలిసి నృత్యాలు చేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనడంతో అక్కడ సందడి నెలకొంది. యువతలో భక్తి భావనతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాలుగా కుషాయిగూడ టీజీఐఐసీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం భ క్తిశ్రద్ధలతో 13 రోజుల పాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చివరి రోజు వేలాది మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, అనంతరం బాజాభజంత్రీల నడుమ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలను మరింత వినూత్నంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కళాశాల విద్యార్థినులతో మహా హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా యువతలో, కళాశాల విద్యార్థినుల్లో భక్తి భావనను పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను వారికి పరిచయం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. వేలాది మంది విద్యార్థినులతో కలిసి మహా గణపతికి హారతి ఇవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, కార్యక్రమం అందరినీ ఆకట్టుకుందని అన్నారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, అసోసియేషన్ చైర్మన్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసారి భారీ సంఖ్యలో విద్యార్థినులతో మహా హారతి నిర్వహించడం ద్వారా యువతను ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కాసం మహిపాల్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, పోలీస్ అధికారులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువసేన యూత్ అసోసియేషన్ ప్రతినిధులు, వసుంధర కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు, కుషాయిగూడ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




