దివ్యాంగులకు 1,080 స్లాట్లు.. ముందస్తు నమోదు తప్పనిసరి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01, (తెలంగాణ దిశ) :
జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సదరం ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు అక్టోబర్ నెలలో మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. సాంబశివరావు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు వివిధ తేదీల్లో మొత్తం 1,080 స్లాట్లతో ఈ క్యాంపులు కొనసాగుతాయని వెల్లడించారు. వివిధ రకాల వైకల్యాలు కలిగిన దివ్యాంగుల కోసం ప్రత్యేక తేదీల్లో క్యాంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రవణ లోపం, దృష్టి లోపం ఉన్న వారికి అక్టోబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో, ఆర్థోపెడిక్ వైకల్యం ఉన్న వారికి అక్టోబర్ 8, 15, 22, 29 తేదీల్లో సదరం సేవలు అందించనున్నారు. అలాగే శ్రవణ లోపం ఉన్న వారికి అక్టోబర్ 2, 6, 13, 27 తేదీల్లో, మానసిక వికలాంగులకు అక్టోబర్ 17, 24, 31 తేదీల్లో క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్యాంపులకు హాజరయ్యే దివ్యాంగులు మీసేవ కేంద్రం ద్వారా ముందస్తుగా నమోదు చేసుకున్న సదరం రశీదు, ఆధార్ కార్డు నకలు, ఛాయాచిత్రం, సంబంధిత వైద్య నివేదికలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. శారీరక వైకల్యం ఉన్నవారు గాంధీ లేదా ఉస్మానియా ఆసుపత్రి నివేదికలు, మానసిక వైకల్యం ఉన్నవారు నిమ్స్ లేదా ఎర్రగడ్డ ఆసుపత్రి నివేదికలు, శ్రవణ లోపం ఉన్నవారు కోటి ప్రభుత్వ ఆసుపత్రి నివేదికలు, దృష్టి లోపం ఉన్నవారు సరోజినీదేవి కంటి ఆసుపత్రి నివేదికలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. క్యాంపులకు హాజరయ్యే వారు ఉదయం 9 గంటలకు మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం మీసేవ కేంద్రాల్లో సదరం స్లాట్లు అందుబాటులో ఉన్నందున అర్హులైన దివ్యాంగులు ముందస్తుగా నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. సాంబశివరావు కోరారు.




