కలెక్టర్ కు దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా టీఎన్జీవోస్ కార్యవర్గం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22, (తెలంగాణ దిశ) :
దసరా పండుగను పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు, ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి (టీ) చైర్మన్ బి. రవిప్రకాష్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అదనపు కలెక్టర్ (పట్టణ స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్‌లను మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా టీఎన్జీవోస్ కార్యాలయం ఏర్పాటుకు తగిన స్థలాన్ని కేటాయించాలని నాయకులు కలెక్టర్, అదనపు కలెక్టర్‌లను కోరారు. ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జిల్లా కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. భరత్ కుమార్, జిల్లా కోశాధికారి శేష సాయి గిరికాంత్, కలెక్టరేట్ విభాగం కార్యదర్శి లింగాల అక్షయ్ కుమార్, కోశాధికారి ఉమాకాంత్, కార్యవర్గ సభ్యులు శివ, వెంకట్ రెడ్డి, భూగర్భ జలాల శాఖ రాష్ట్ర వేదిక సీనియర్ నాయకుడు అంజయ్య, ఖజానా శాఖకు చెందిన నందు లాల్, హర్షిణి తదితరులు పాల్గొన్నారు.




