కుషాయిగూడ, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీ, నిర్మల్ నగర్ ప్రాంతానికి చెందిన పెరమళ్ళ రేవతి (30) అనే మహిళ కుటుంబ కలహం నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేవతికి తన భర్త పెరమళ్ళ నవీన్ కుమార్ (35)తో కుటుంబ విషయమై గొడవ జరిగింది. దీంతో ఈ నెల 18వ తేదీ ఉదయం సుమారు 8 గంటల సమయంలో రేవతి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అనంతరం ఆమె కోసం బంధువుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో నవీన్ కుమార్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేవతి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఆమెకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.




